13, జులై 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1472 (పూవులో రెండు పూవులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు.

21 కామెంట్‌లు:

  1. గురువు పాఠము వివరించు తఱిని "పద్మ
    వదన, పద్మ నయన" యను వర్ణనలను
    గని పలికెనిట్లు శిష్యసంఘమ్ము తోడ-
    "పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు."

    రిప్లయితొలగించండి
  2. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కలికి వదనపద్మమ్మున కలువ కనులు
    మిత్రునకు నాప్తు లొక్కరు శత్రువొకరు
    నిరువురిని పొందె నీ లతాంగిదియ వి౦త .
    పూవులో రెండు పూవులు పూచె గనుడు

    రిప్లయితొలగించండి
  3. మల్లె తీగెల నల్లెను యుల్ల మలర
    జాజి విరజాజు లన్నియు మోజు బడుచు
    కనుల విందుగ వికసించె గనగ వింత
    పూవులో రెండు పూవులు పూచె గనుడు

    రిప్లయితొలగించండి
  4. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులందఱికిని నా నమోవాకములు. పూజ్యులు పండితనేమానివారికి శీఘ్రస్వస్థతఁ జేకూర్పవలెనని యా భగవంతుని బ్రార్థించుచు...

    ఉవిద ముఖపద్మమునను నీలోత్పలములు
    సూర్యచంద్రులు లేకయే చోద్యముగను
    వికసనమునందెఁ గవులార వేగిరముగఁ
    బూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు!

    రిప్లయితొలగించండి
  5. పుడమి తల్లికి పుష్పమై పూచె సీత
    పుత్రులిరువురు గలిగిరి భూమిజకును
    పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు
    రాముడేలెను రాజ్యము రక్తిమీర

    రిప్లయితొలగించండి

  6. పద్మ మందున తానుంచి పాదములను
    మాత లక్ష్మియె నిలుచున్న రీతి జూడ
    పాదయుగళమ్ము బోల్చగా పద్మమనుచు
    పూవులో రెండు పూవులు పూచె గనుడు

    రిప్లయితొలగించండి
  7. సిగ్గులొలుకుచు ప్రేయసి చెంత నిలువ
    కమలిని ముఖారవిందాన కనులు జూచి
    పరవశమ్మున చెలికాడు పలికె నిటుల
    పూవులో రెండు పూవులు పూచె గనుడు

    రిప్లయితొలగించండి
  8. ’ముఖ కమలమన కమలాలు పూచె’ ననుచు
    కాళిదాసు పూరించెనట కవులుమెచ్చ
    శంకరార్యుండు తెలుగించె శంకదొలగ
    "పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు”

    రిప్లయితొలగించండి
  9. మల్లెల వారిపూరణలు
    బిడ్డ కల్గగలేదనిభీతి న౦ది
    వైద్యుకున్ జూపె భార్యను, భర్త తోడ
    నాతడు తెలిపెను కవలల న౦దు వీవు
    పూవులో రెండు పూవులు పూచె గనుడు
    ముద్దా మందార మందున ముదము మీర
    పూవులయ్యెడి పెక్కురు పొదల గాదె
    వింత గాదది యంచును విప్పి జూపె
    పూవులో రెండు పూవులు పూచె గనుడు
    పద్మముఖి యని యందురే పండితాళి
    ముఖము నందున కన్నులే మోద మిచ్చు
    రె౦దు కలువలు యట్లని లీలగాను
    పూవులో రెండు పూవులు పూచె గనుడు

    రిప్లయితొలగించండి
  10. బ్లాగువనమున శంకరా భరణమనెడు
    పుష్ప,మందు సమస్యల పూరణంబు,
    పద్యరచనమనెడు కుసుమాలు పూయు
    పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు

    రిప్లయితొలగించండి
  11. కమలముల వంటి చక్కని కనుల తోడ
    పొన్నపువ్వును బోలెడు పొక్కిలి కడు
    శోభ గూర్చ ననెనొకండు సుభగిఁ గాంచి
    పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు

    రిప్లయితొలగించండి
  12. చిత్తరువులనుంచిన శాల చేరినాము,
    మనములింపార తిలకించి మదిని నింపి
    కొనుడు, మిత్రమా! దృష్టిని కొంత నిలిపి
    పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు.

    రిప్లయితొలగించండి
  13. వసుధ వెలుగులఁ జిమ్ముచు వాసి కెక్కె
    తెలుగు భాషా ప్రసూనమ్మ తేనెలమ్మ! 
    రెండు రాష్ట్రాలుగ విరిసె,లెస్స బలుక
    పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు!

    రిప్లయితొలగించండి
  14. సూర్యు డొక్కటి పుష్పమ్ము చూడగాను
    చంద్రుడింకొక సుమమేను చక్కగాను
    కన్నులమ్మకు లలితకు కమల ముఖికి
    పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు !

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు.
    రాత్రినుండి జ్వరం వస్తున్నది. అందువల్ల మీ పూరణలను వెంటవెంటనే సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలను అందించిన....
    ఊకదంపుడు గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గుండు మధుసూదన్ గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    యం.ఆర్.చంద్రమౌళి గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సహదేవుడు గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. మాస్టరుగారూ ! ధన్యవాదాలు...కొంత విశ్రాంతి తీసుకొనండి..త్వరగా స్వస్థత చేకూరాలని కోరుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి