7, జులై 2014, సోమవారం

పద్యరచన - 613

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. చిర్నగవు చెదర నీయక
    కర్ణ విరాజిత సుమధుర కంఠము తోడన్
    కర్నాటక సంగీతముఁ
    బూర్ణముగా బాలమురళి పుక్కిట బట్టెన్!

    రిప్లయితొలగించండి
  2. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘న,ణ’ ప్రాస ...?

    రిప్లయితొలగించండి
  3. చిన్న వయసు నందే కడు
    మిన్నగ పాడుచు మరింత మేలిమి గానం
    బెన్నగ రూపొందించిన
    వెన్నియొ రాగములు; కీర్తి నివ్విధిఁ బెరిగెన్.

    రిప్లయితొలగించండి
  4. పేరునందునబాలుండె పేరు పెద్ద
    వాద్యమున్నది పేరులో వాక్కు తీపి
    గీతజెప్పిన వాడె సంగీతమందు
    మంగళంబగు నాగళ మహిమనెన్న.

    రిప్లయితొలగించండి
  5. రసములూరంగ పాడె కర్ణాటగీతి
    నవ్యరీతుల నటియించె నారదుఁడుగ
    కళలకెల్లను కాణాచిగా వెలింగె
    మంగళంపల్లి కాడె సన్మంగళుండు.

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. త్యాగరాజుని కృతు లాగళమ్మున తీపి
    ......దీక్షితారువి రసోద్దీపనములు
    శ్యామశాస్త్రీయముల్ సామగానమ్ములు
    ......రామదాసువి మనోరంజకములు
    అన్నమయ్యపదమ్ములా కంఠమున మేలు
    ......క్షేత్రయ్య పదములు జీవనదులు
    లలిత గీతములు థిల్లానలు తత్త్వముల్
    ......గేయముల్ రాగముల్ కీర్తనములు

    మంగళంపల్లి వంశ సన్మంగళుండు
    బాల మురళీరవుండు గానాల హేల
    తెలుగు వాగ్గేయకారుండు పలుకుతల్లి
    ముద్దుబిడ్డడు సంగీత మూర్తి యితడు.

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    మంగళంపల్లి వారి గురించి అద్భుతమైన సీసపద్యాన్ని రచించి అలరింపజేశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. బాల మురళీ కృష్ణుని పాట వినగ
    పులకరించును తనువెల్ల పూర్తి గాను
    ఖ్యాతి నొందిన మహనీయ గాయకుండు
    అతను సంగీత సామ్రాట్టు యనుట పాడి

    రిప్లయితొలగించండి
  10. గురువుగారికి ధన్యవాదములు. ణ,న లకు గతంలో ప్రాస
    ప్రాస వేసిన గుర్తు.తప్పైతే మన్నిచండి. కొందరి ప్రముఖుల
    పద్యాల్లో చూచిన గుర్తు.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ మీ సీసము చూచిన తరువాత నాకూ సీసము రాయాలనిపించి వ్రాశాను..ధన్యవాదములు.
    మాస్టరుగారూ ధన్యవాదములు...


    పంచరత్నములను పరవశమ్మున బాడి
    త్యారాజును మన తలపు నింపు
    రాముని కీర్తనల్ రమ్యంబుగా పాడి
    అలనాటి గోపన్న యార్తి పంచు
    తిల్లాన జల్లులే తీపిగా కురిపించి
    ప్రేక్షకజనముల ప్రీతి ముంచు
    కర్ణాట సంగీత గానమ్ము తలపగా
    తనదు రూపమెమన తలను నిల్చు


    పేరునందునబాలుండె పెద్ద పేరు
    వాద్యమున్నది పేరులో వాక్కు తీపి
    గీతజెప్పిన వాడె సంగీతమందు
    మంగళంబగు నాగళ మహిమనెన్న.

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి రామారావు గారి పూరణ : కరెంటు కోతలవలన ఆలస్యముగా టైపు చేయడమైనది
    సరిగమ పదనిస స్వరసుర ఝరి నిలఁ
    బారించి నట్టి తాపసి యతండు
    కర్ణాట సంగీత కమనీయ సత్కళా
    శారద చేతి కచ్ఛతి యతడు
    దేశ విదేశీయ ధీయుతాహీంద్రుల
    తలలూపు గాన గందర్వు డతడు
    ఉస్తాదులు గూడ కుస్తీకిఁ తలపడ
    వణకెడు కోవిదాగ్రణి యతండు
    మంగళం పల్లి వంశాబ్ది పొంగి పొరల
    బాలమురళి గాఁ బుట్టి గోపాల బాలు
    పెదవిఁ దాకిన మురళి యై పెంపుఁ దనరి
    భువనములను సమ్మోహనమొందజేసె

    రిప్లయితొలగించండి
  13. అమ్మ కడుపులోనె ఔపాసనల్ పట్టి
    నాదవిద్యల నేర్చె నాదబ్రహ్మ

    బాల! యనుచు మక్కువగొని బిరుదు నిచ్చె
    ముద్దుగాను ముసిరి మురిసి పోవ

    మేలుగ నందరు మెచ్చగ మేటియౌ
    మేళకర్తల కూర్చె మిగుల రక్తి

    సొంపుగా రాగాలు "సుముఖము"గాపాడి
    భావమ్ము విరజిల్ల బాగ తెలిపె

    పలుకు బోటి పసిడి వీణ పైస్వరములు
    జాలువారి నతని కుత్తుక జనె నేమొ
    పలు రీతుల నాకృతి పడయుచునవి
    మురళి మాధురీ గాన సమ్మోహనమై

    రిప్లయితొలగించండి
  14. ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మురళీ కృష్ణుని’ అన్నచోట గణదోషం. అలాగే ‘గాయకుండు + అత(ను)డు, స(సా)మ్రాట్టు + అనుట’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. విసంధిగాను, యడాగమంతోను వ్రాయరాదు.
    *
    సహదేవుడు గారూ,
    ఏదో క్వాచిత్కంగా ఒకటి రెండు ప్రయోగాలు ఉండవచ్చు. మనం అనుసరించకపోవడమే మంచిది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి రామారావు గారూ,
    మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
    ‘కచ్ఛపి’ టైపాటు వల్ల ‘కచ్ఛతి’ అయింది. ‘ఉస్తాదులు గూడ’ అన్నచోట గణదోషం.. ఆ పాదాన్ని ‘ఉస్తాదులను గూడ కుస్తీకిఁ దలపడ వణికించు కోవిదాగ్రణి యతండు’ అనండి.
    *
    మాజేటి సుమలత గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    ఎత్తుగీతి రెండవ పాదంలో యతి, మూడవ పాదంలో గణం తప్పాయి.

    రిప్లయితొలగించండి
  15. ధన్యవాదములు గురువు గారు. సవరించాను అని అనుకుంటున్నాను.

    పలుకు బోటి పసిడి వీణ పైస్వరములు
    జాలువారి ఆ గళమున జారె నేమొ
    హృద్యముగ పాడ రంజిలె హృత్కమలము
    మురళి మాధురీ గాన సమ్మోహనమై

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ నా పద్యం మీకు స్ఫూర్తి నిచ్చినందుకు సంతోషం. మీ సీసం నా సీసం కన్నా బాగుంది.

    రిప్లయితొలగించండి
  17. చంద్రమౌళి సూర్యనారాయణ గారి సీసం బాలమురళీకృష్ణ గారి కీర్తిలాగే స్వచ్చంగా ప్రకాశిస్తోంది.

    మాజేటిసుమలత గారి పద్యం చాలా బాగుంది. ఎత్తుగీతి లోని ఆఖరి పాదంలోని ఆఖరు పదం 'మయి' అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  18. మాష్టరు గారు. ఛాల సంతోషము. నాకు మీ ప్రశంశ స్పూర్తి.

    రిప్లయితొలగించండి
  19. మాస్టరుగారూ ! మిస్సన్న గారూ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి